ఆసుపత్రిలో ప్రసవం - తల్లిబిడ్డ క్షేమం
తల్లి మరియు నవజాత శిశు ప్రాణభద్రతను కాపాడుకోవాలంటే ప్రతి గర్భిణీ తప్పనిసరిగా ఆసుపత్రిలోనే ప్రసవం చేయించుకోవాలని పులిచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి సూచించారు. దేవళంపేట గ్రామ పంచాయతి దిగువ మూర్తి వారి పల్లెకు చెందిన సురేష్ భార్య మౌనిక తన మూడవ కాన్పులో పండంటి పాపకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలు డాక్టర్ అపర్ణ ఆధ్వర్యాన నిర్వహించిన ప్రసవంలో జన్మనిచ్చింది. తల్లిబిడ్డ సురక్షితంగా ఉండటం పట్ల కుటుంబ సభ్యులు మరియు సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వైద్యులు మాట్లాడుతూ ప్రసవ సమయంలో తల్లికి కలిగే రక్తస్రావం, అధిక రక్తపోటు, అనీమియా వంటి అకస్మాత్తు సమస్యలు తలెత్తినపుడు ఆసుపత్రిలో వెంటనే అత్యవసర చికిత్స అందించడం వల్ల తల్లికి పూర్తి ప్రాణభద్రత ఉంటుందని తెలిపారు. శిక్షణ పొందిన వైద్యులు, నర్సుల పర్యవేక్షణ వల్ల తల్లి–శిశువుకు మెరుగైన వైద్య సేవలు లభిస్తాయని పేర్కొన్నారు.
శిశువు పుట్టిన వెంటనే శ్వాస సంబంధిత సమస్యలు, తక్కువ బరువు, ఇతర పుట్టుక లోపాలను తక్షణమే గుర్తించి చికిత్స చేయగల సదుపాయాలు పులిచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నాయని తెలిపారు. పుట్టిన వెంటనే అవసరమైన టీకాలు కూడా వేయడం జరిగిందని తెలియజేశారు. ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న జననీ సురక్ష యోజన, ఉచిత మందులు, పరీక్షలు, రవాణా సదుపాయాలు గర్భిణీలకు అందజేస్తున్నామని తెలిపారు. ప్రసవానంతరం తల్లి, శిశువుకు పూర్తి వైద్య సంరక్షణ అందుతుందని, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకోవడం ద్వారా కుటుంబంపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా తల్లి–శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉండటం వల్ల కుటుంబం సంతోషంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ నర్స్ శ్రీదేవి, ఆరోగ్య పర్యవేక్షకురాలు ప్రమీల, స్టాఫ్ నర్సులు రేవతి, ఫెమీలా, సిబ్బంది జబీన్ తాజ్, సుమిత్ర మరియు ఆశా కార్యకర్త కళారంజని పాల్గొన్నారు.


