రెండేళ్లు గడిచినా పట్టణాల అభివృద్ధి శూన్యం
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్....
కోరుట్ల, డిసెంబర్ 3 (9వ్యూస్) కోరుట్లలోని మున్సిపల్ కార్యాలయంలో బుధవారం రోజు మున్సిపల్ అధికారులతో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా పట్టణాల అభివృద్ధి గురించి ప్రభుత్వం అసలు ఆలోచించటం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ కాలంలో TUFIDC గ్రాంట్ పేరుతో మున్సిపాలిటీలకు నేరుగా నిధులు విడుదలయ్యేలా చేసి, ప్రతినెలా పట్టణ ప్రగతి కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అవే నిధులను పేరు మార్చి UIDF గా ఇస్తున్నట్లు చూపిస్తున్నప్పటికీ, రెండేళ్లలో కోరుట్ల పట్టణానికి ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పట్టణంలో కొన్ని వార్డులలో రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేస్తే సమస్యల పరిష్కరించడం సాధ్యమవుతుందని తెలిపారు. ఎక్కడో పట్టణం బయట రెండు కోట్ల రూపాయలతో పార్క్ నిర్మాణం చేపడుతున్న ప్రభుత్వం, పట్టణ మధ్య ప్రాంతాల్లో ఉన్న రోడ్డు–డ్రైనేజీ సమస్యలను పూర్తిగా పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణాభివృద్ధి దిశగా అడుగులు వేయాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్, డి.ఈ సురేష్, టౌన్ ప్లానింగ్ అధికారులు రమ్య ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

