రైతు అభ్యున్నతే ప్రజా ప్రభుత్వ లక్ష్యం సోముడిలో తొలిసారిగా ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
చివరి గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది – ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
9 వ్యూస్ ప్రతినిధి కే సుదర్శన్– కాజీపేట, నవంబర్ 13:రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ప్రజా ప్రభుత్వం రైతు అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతోందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గారు తెలిపారు. గురువారం కాజీపేట మండలం సోముడిలో ఏర్పాటు చేసిన కొత్త ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ – “గతంలో సోముడి రైతులు కొనుగోలు కేంద్రం లేని కారణంగా తమ ధాన్యాన్ని దూర ప్రాంతాలకు తరలించి అమ్మే పరిస్థితులు ఎదుర్కొన్నారు. రైతుల ఆవేదనను అర్థం చేసుకుని, వారి సౌకర్యార్థం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం” అన్నారు.
రైతులు తమ గ్రామంలోనే ధాన్యం విక్రయించే వీలుతో రవాణా ఖర్చులు తగ్గి, మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా ప్రభుత్వానికి అమ్మే అవకాశం లభిస్తుందని తెలిపారు. ధాన్యానికి సరైన ధర లభించేలా, రైతుల ఖాతాల్లో సమయానికి చెల్లింపులు జమయ్యేలా పారదర్శక వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
“రైతు బలంగా ఉంటే గ్రామం బలంగా ఉంటుంది, గ్రామం బలంగా ఉంటే తెలంగాణ బలంగా ఉంటుంది” అని ఆయన పేర్కొన్నారు. గతంలో పాలించిన ప్రభుత్వాలు సోముడి రైతుల పక్షాన ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాతిగా నిలుస్తూ, పంట ఉత్పత్తి నుండి విక్రయం వరకు ప్రతి దశలో మద్దతు అందిస్తోందని అన్నారు.
రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పథకం ద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించిందని, రైతు బంధు పథకాన్ని పారదర్శకంగా కొనసాగిస్తూ ప్రతి ఎకరాకు నేరుగా రైతుల ఖాతాల్లో సాయం జమ అవుతుందని ఎమ్మెల్యే వివరించారు.
అలాగే రైతు బీమా, ఉచిత విద్యుత్, ఎరువుల సరఫరా, రైతు సమన్వయ సమితుల బలోపేతం వంటి పథకాలతో గ్రామ స్థాయి నుండి రైతు దాకా ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, సయ్యద్ విజయశ్రీ రాజాలి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

.jpg)