ఆర్టీసీ బస్సులు పీలేరు పట్టణం గుండా నడపాలి
కళాశాలకు, పాఠశాలలకు మరియు ప్రభుత్వ కార్యాలయాలకు పోవాలి అంటే ప్రైవేట్ వాహనాలే దిక్కు
విద్యార్థులు మరియు గ్రామీణ ప్రాంత ప్రజలపై ఆర్థిక భారం
ఉన్నతాధికారులు స్పందించాలని ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల.అమృత్ తేజ డిమాండ్
పీలేరు,అన్నమయ్య జిల్లా:పీలేరు పట్టణం గుండా ఆర్టీసీ బస్సులు నడపాలి అని నేడు ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల.అమృత్ తేజ , జిల్లా అధ్యక్షులు సాయి సంపత్ ఆధ్వర్యంలో పీలేరు ఆర్టీసీ డిపో కార్యాలయం ముందు నిరసన తెలిపారు. తదుపరి అసిస్టెంట్ డిపో మేనేజర్ ధనుంజయులు గారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అమృత్ తేజ మాట్లాడుతూ పిలేరు పట్టణంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను సాకు చూపుతూ ఆర్టీసీ బస్సులు పట్టణమధ్య గుండా నడపడం లేదు అని అన్నారు. దీనివల్ల రోజూ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే అనేక మంది విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలియజేశారు. మదనపల్లి మార్గం నుంచి పీలేరుకు వచ్చే బస్సులు హైవే గుండా నేరుగా ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లిపోవడం వల్ల పట్టణానికి నేరుగా బస్సు సౌకర్యం లేకుండా పోయింది. దీనివల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు బస్టాండ్ వరకు వెళ్లి, అక్కడి నుంచి మళ్లీ నడుచుకుంటూ లేదా ఆటోలను తీసుకుని విద్యాసంస్థలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.ఆర్టీసీ బస్సులు పట్టణంలోకి మునుపటిలానే వస్తే, విద్యార్థులు కళాశాలల సమీపంలోనే దిగే అవకాశం ఉంటుంది. ఇది వారికి సమయాన్ని, ఖర్చును ఆదా చేస్తుంది తెలిపారు.అలాగే పీలేరు పట్టణంలో ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు ఎమ్మార్వో కార్యాలయం, పోలీస్ స్టేషన్, కోర్టు,రిజిస్టర్ కార్యాలయం ,ఎంపీడీవో కార్యాలయం , హౌసింగ్ కార్యాలయం , మండల విద్యా శాఖ అధికారి కార్యాలయం మొదలైనవి పట్టణంలోనే ఉన్నాయి. ప్రస్తుతం బస్టాండ్ వద్ద బస్సులు ఆగుతున్నందున ప్రజలు పని కోసం ఈ కార్యాలయాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇది వారికి ఆర్థికభారంగా మారుతోందన్నారు. పట్టణంలో ఆర్టీసీ బస్సు సేవలను తిరిగి పునరుద్దరిస్తే విద్యార్థులు, ప్రజలు, ఉద్యోగులు అందరికీ ఎంతో ఉపశమనంగా ఉంటుంది. పూర్వంలాగా బస్సులు పట్టణం గుండా తిరగడం అవసరం. కావున, పీలేరు పట్టణంలో ఆర్టీసీ బస్సు మార్గాలను తక్షణం పునరుద్ధరించి ప్రజలకు, విద్యార్థులకు సౌకర్యం కల్పించవలసిందిగా NSUI విద్యార్థి సంఘం తరఫున కోరుతున్నాము అని అన్నారు. లేనిపక్షంలో భవిష్యత్తులో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నంద కిషోర్, వాసు, నీరజ్, లికిత్ గురు, రామ్, గోకుల్, లక్ష్మణ్, షాన్వాజ్, ఉస్మాన్, రకీబ్, షబీర్, ఆఫాన్, చరణ్ తేజ తదితరులు పాల్గొన్నారు.


