న్యూమోనియా ప్రాణాంతకమైనది

 న్యూమోనియా ప్రాణాంతకమైనది



ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల పిల్లల్లో మరణాలు సంభవించడానికి కారణం న్యూమోనియా వ్యాధని, దీని బారిన పడకపోతే బాల్యం బాగుంటుందని పులిచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ న్యూమోనియా దినోత్సవాన్ని పురస్కరించుకొని చిన్నపిల్లల తల్లిదండ్రులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ న్యూమోనియా అనేది ఊపిరితిత్తుల్లో వచ్చే తీవ్రమైన ఇన్ఫెక్షన్ అన్నారు. ఇది బ్యాక్టీరియా, వైరస్ లేదా ఫంగస్ వంటి సూక్ష్మజీవుల వల్ల సంభవిస్తుందని తెలిపారు. ఈ వ్యాధి వల్ల ఊపిరితిత్తుల్లోని గాలి సంచులు వాపు చెంది వాటిలో ద్రవం చేరిపోతుందని, దీని ఫలితంగా తగిన ఆక్సిజన్ అందక శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందికరంగా అనిపిస్తుందని, శరీరం బలహీనపడి అవయవాలు సరిగా పనిచేయకపోవడం జరుగుతుందని తెలిపారు. అధిక జ్వరం, ద్రవంతో కూడిన దగ్గు, వేగంగా ఊపిరి పీల్చుకోవడం లేదా ఊపిరి బిగుసుకోవడం, ఛాతిలో నొప్పి, బిడ్డ పాలు తాగకపోవడం, ఆహారం తీసుకోకపోవడం, బలహీనంగా, అలసటతో ఉండడం, శరీరం చల్లబడి వణుకు రావటం న్యూమోనియా లక్షణాలని, పిల్లలో ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సదుపాయం పొందాలన్నారు. త్వరగా చికిత్స పొందితే ప్రాణాపాయం ఉండదన్నారు. న్యూమోనియాను నివారించడానికి బిడ్డకు మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, తద్వారా వారిలో వ్యాధి నిరోధక శక్తి బాగా తయారవుతుందని తెలిపారు. ఆరునెలల తర్వాత తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం ప్రారంభించాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన టీకాలను తప్పనిసరిగా పిల్లలకు వేయించాలని సూచించారు. పిల్లలు ఉన్న పరిసరాలలో వాయు కాలుష్యం లేకుండా పరిశుభ్రమైన గాలి ఉండేలా జాగ్రత్త వహించాలన్నారు. తల్లిదండ్రులు తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవాలని సూచించారు. న్యూమోనియా పై అవగాహన కల్పించి, లక్షణాలు గల పిల్లలను గుర్తించి చికిత్స అందజేయుట కొరకు 'సాన్స్' పేరుతో కార్యక్రమం నేటి నుండి ప్రారంభించడం జరిగిందని, ఆరోగ్య సిబ్బంది ఇంటింటిని సందర్శించి చిన్నపిల్లలు కలిగిన తల్లిదండ్రులకు వ్యాధి లక్షణాలు వివరించి అవగాహన కల్పిస్తారన్నారు. సమావేశంలో వైద్యురాలు డాక్టర్ అపర్ణ, ఆరోగ్య పర్యవేక్షకులు పురుషోత్తం, సిబ్బంది జ్యోతికుమార్, ఫెమిలా, రాణి మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.