వరంగల్ కోసం ప్రభుత్వం – 12 కోట్ల సాయం విడుదల . వరంగల్ నగరాన్ని రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తున్నాం – ఎంపీ డాక్టర్ కడియం కావ్య.
మొంథా తుఫాన్ బాధితుల పట్ల ప్రభుత్వ వేగవంతమైన స్పందన ప్రశంసనీయం
9 వ్యూస్ ప్రతినిధి కే.సుదర్శన్ – హన్మకొండ, నవంబర్ 13:హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు మాట్లాడుతూ, మొంథా తుఫాన్ ప్రభావంతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్న వరంగల్ జిల్లావాసులకు కేవలం 11 రోజుల్లోనే రూ.12 కోట్ల సాయాన్ని విడుదల చేయడం సీఎం రేవంత్ రెడ్డి గారి దూరదృష్టి నాయకత్వానికి నిదర్శనం అని అన్నారు.
ఈ సమావేశంలో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ –
“పేద ప్రజల కష్టాలు తెలిసిన సీఎం రేవంత్ రెడ్డి గారు తుఫాన్ వచ్చిన రెండో రోజే క్షేత్ర స్థాయిలో పర్యటించి బాధితులను ఆదుకున్నారు. ప్రభుత్వం బాధితులకు అండగా నిలవడం సంతోషకరం. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం వేగవంతంగా చేపడుతున్నాం” అని తెలిపారు.
అలాగే వరంగల్ నగర అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు టీమ్‌వర్క్‌గా పనిచేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ నిధులను సమీకరించి నగర అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్ నగరాన్ని రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తున్నారు” అని ఆమె స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతుందని, రాబోయే ఎన్నికల్లో కొత్త వాగ్దానాలతో ప్రజల ముందుకు వెళ్తుందని ఎంపీ పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు అకాల వర్షాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సిగ్గుచేటు అని ఆమె విమర్శించారు. “బీఆర్ఎస్, బీజేపీ మాయమాటలు ప్రజలు ఇక నమ్మే స్థితిలో లేరు” అని వ్యాఖ్యానించారు.
వర్షాల సమయంలో ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు ముందస్తు చర్యలు తీసుకున్నారని, అనంతరం ముఖ్యమంత్రిని స్వయంగా క్షేత్ర స్థాయికి తీసుకెళ్లి ప్రజల బాధలను తెలియజేశామని ఎంపీ వివరించారు.
అనంతరం ఎంపీ కడియం కావ్య ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మృతికి సంతాపం ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ అజీజ్ ఖాన్, పులి అనిల్, ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
-

.jpg)